హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణంలో ప్రతి గల్లీలో డ్రైనేజీలు ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణం పచ్చగా కనిపించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో చైర్‌పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది.
2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.21.88 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలని అన్నారు.
అంతకు ముందు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 50 శాతం సబ్సిడీతో మంజూరైన వ్యవసాయ పరికరాలను అందజేశారు. బంజారా భవన్‌లో నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పూజలు చేశారు. మహిళలతో కలిసి బంజారా నృత్యం చేశారు.
ఈనెల 22న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
నర్మెట్టలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా నర్మెట్టలో మూడు రోజుల పాటు భారీ స్థాయిలో ‘రైతు మేళా’ నిర్వహించనున్నట్లు చెప్పారు. మేళాలో అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
